మోదీకి ఇండోనేషియా మరో అరుదైన గౌరవం.. వీడ్కోలులోనూ వెంట వచ్చిన యుద్ధ విమానాలు

  • ఇండోనేషియా నుంచి మోదీకి ఐదు యుద్ధ విమానాల ఎస్కార్ట్‌
  • 3 రోజుల పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాకు బయలుదేరిన ప్రధాని
  • విమానాశ్రయంలో అధ్యక్షుడు ప్రబోవో స్వయంగా వీడ్కోలు
  • రక్షణ, సాంకేతిక రంగాల్లో కొత్త సహకారానికి మార్గం
  • ఇండోనేషియా మోదీ కృతజ్ఞతలు
మూడు రోజుల అధికారిక పర్యటన ముగించుకుని ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశం నుంచి అరుదైన గౌరవం దక్కింది. మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన ఐదు యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా వెళ్లాయి. రెండు దేశాల మధ్య బలపడుతున్న సంబంధాలకు ఇది ప్రతీకగా నిలిచింది.

ఇండోనేషియా గగనతలంలో మోదీ విమానంతో పాటు యుద్ధ విమానాలు సమాంతరంగా ప్రయాణించిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మోదీ జకార్తాకు చేరుకున్న సమయంలోనూ ఆయన విమానానికి ఇండోనేషియా ఫైటర్‌ జెట్లు ఎస్కార్ట్‌గా వచ్చి స్వాగతం పలికాయి.

పర్యటన ముగిసిన తర్వాత ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి వీడ్కోలు పలికారు. విమానంలోకి ఎక్కే ముందు ఇద్దరు నాయకులు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఈ పర్యటనతో భారత్‌, ఇండోనేషియా మధ్య పలు కీలక రంగాల్లో సహకారానికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని ప్రధాని మోదీ తెలిపారు. రక్షణ, భద్రత, సముద్ర సహకారం, కృత్రిమ మేధ, డిజిటల్‌ ఇన్నోవేషన్‌ వంటి రంగాల్లో కలిసి పనిచేసే దిశగా కీలక అడుగులు పడ్డాయని పేర్కొన్నారు.

తనకు ఆత్మీయ స్వాగతం పలికిన ఇండోనేషియా ప్రజలకు, అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన చూపిన వ్యక్తిగత చొరవను ప్రత్యేకంగా అభినందించారు.

Narendra Modi
Indonesia
Prabowo Subianto
Fighter Jet Escort
India Indonesia Relations
Jakarta

More Telugu News